Monday, September 23, 2013

కాన్పూర్ కాపురం

'ఏంటి, కాన్పూర్ ట్రన్స్ఫెర్ చేసారా ? అసలు దేశ పటంలో ఎక్కడుంది ఆ ఊరు?' మా
వారిని అడిగాను నేను 2005 లో.
'U.P, ఢిల్లీ దగ్గర, ఏమయినా వెళ్లక తప్పదుగా,' అన్నారు మా వారు.
మొత్తానికి, ఒక దుర్ముహూర్తాన, బెంగుళూరు నుంచి తట్ట బుట్టా, ఎక్కించేసి,
ఫ్లైట్ లో ఢిల్లీ దాకా వెళ్లి, అక్కడి నుంచి, ట్రైన్ లో కాన్పూర్ చేరుకున్నాం.
దారిపొడుగునా, నా మూడేళ్ళ కూతురు, 'అమ్మా, యే ఊరు వెళుతున్నాం, కంపూరా?' అని
అడుగుతూనే ఉంది.
స్టేషన్ లో దిగగానే, అదో రకం విచిత్ర వాతావరణం. బ్రిటిష్ వాళ్ళు కట్టించిన
స్టేషన్, వాళ్ళు వెళ్ళాకా, బూజులు కూడా దులిపినట్టు లేదు. ప్లాట్ఫారం అంతా
చాలా అపరిశుబ్రంగా ఉంది. అక్కడే పళ్ళు తోమేస్తున్నారు, అక్కడే స్నానాలు
చేసేస్తున్నారు, అక్కడే నిద్రపోతున్నారు, అక్కడే తినేస్తున్నారు. నా మొహం
చూసీ, చెప్పడం మొదలుపెట్టారు మా వారు, 'ఇక్కడ ఆటోలు కూడా దొరకవు. మన పక్కంత
శుబ్రత ఉండదు. తోలు పరిశ్రమకు ప్రసిద్ధం ఈ ఊరు. అందుకే, కాలుష్యం ఎక్కువ.
చదువుకున్న వాళ్ళు తక్కువ. అభద్రతా, దొంగతనాలు ఎక్కువ. ఊరు మొత్తం మీద,
నివాసయోగ్యమయిన, ప్రదేశాలు అతి తక్కువ. వాటిలో చూసీ, ఒక ఫ్లాట్ అద్దెకు
తీసుకున్నాను. సామాను వచ్చేసరికి వారం పడుతుంది. ఈ లోపల మనం ఉండడానికి హోటల్
బుక్ చేసాను, పద..' ,అంటూ టాక్సీ పిలిచారు.
వెళుతుంటే, గుంటలు పడ్డ పాత రోడ్లు, ఆ రోడ్ల మీద సగం పైగా ఆక్రమించుకున్న
చెత్త, ఎక్కడికక్కడ మొబైల్ స్పీడ్ బ్రేకేర్ల లాగా, రోడ్డుకు అడ్డంగా పడుకున్న
గేదెలు, ఆవులు.కొన్ని వాహనాలకు నంబెర్లు లేవు. వాళ్ళంతా, వివిధ రాజకీయ
నాయకులట. జండాలు పెట్టుకు తిరిగేస్తారట. పత్రికల వాళ్ళు నెంబర్ బదులు కేవలం
'PRESS' అని రాసుకు తిరిగేస్తారట. హోటల్ కు వెళ్లాం. హోటల్ మేను లో ఇడ్లి,
దోసా ఏమి లేవు. పూరి, జిలేబి, బ్రెడ్ బట్టర్ అంతే. 'పొద్దుటే, జాలీగా
,జిలేబిలు తింటారా,ఇక్కడ?', వెటకారంగా అడిగిన నాకు, 'అవును, వీళ్ళకి, పూరి,
జిలేబి, లేదా సర్వ కాల సర్వావస్థల్లో పరాటా, అంతే. వేరే టిఫిన్లు ఉండవు. '
చెప్పారు. నాకు సగం సత్తువ పిండేసినట్టు అనిపించింది. వేరే ఎక్కడన్నా దొరుకుతే
చూద్దాంలే, బెంగపడకు, అన్నారు. సాయంత్రం ఫ్లాట్ చూడడానికి, ఐదు కిలోమీటర్లు
రిక్షా ఎక్కి వెళ్లాం, ఆటోలు ఉండవు కదా మరి.
'శాంతివన్' పేరున్న ఫ్లాట్ గేటు దగ్గర ఆగాం. వివరాలు రాసి వెళ్ళమన్నారు.
రాస్తుండగానే, వాచ్ మాన్ , 'आपका नाम सतीश, आगे क्या है' అడిగాడు. అర్ధం కాక
మా వారి వంక చూసాను,'సతీష్ శర్మ', అన్నారు. ఎన్ని ఊళ్లు తిరిగినా కులం అవసర
పడలేదు మాకు .'ఇండియన్ హిందూ 'తోనే సరిపెట్టుకున్నాం. కాని, అక్కడి వాళ్ళకు
కులం పట్టింపులు ఎక్కువట. అపార్ట్మెంట్ ఎదురుగుండా జూ పార్క్, వెనక బాల్కనీ లో
గొడ్ల సావిడి. ఎదురింటికి వెళ్ళాం. ఆవిడ, లోపలికి పిలిచి, టీ ఇచ్చి,
కూర్చోపెట్టారు. 'ఇక్కడ కరివేపాకు దొరుకుతుందా?' అడిగాను నేను, అంతకు ముందు
బొంబాయి లో ఉన్న అనుభవం వల్ల. 'దొరుకుతుంది, బజార్లో అమ్మారు కాని, పక్కన
స్కూల్ ఫెన్సింగ్ అంతా కరివేపాకే వేసారు. కోసుకోవచ్చు,' అంది. 'పని వాళ్ళు
దొరుకుతారా?' అడిగాను. ఓ, బోలెడు మంది, అయినా, అసలు సమస్య ఇవన్ని కాదు, ఇక్కడ,
రోజులో పదహారు గంటలు కరెంటు ఉండదు, ఇంకా, నెలకు మూడు రోజులు పూర్తిగా కరెంటు
ఉండదు. మీకు ఇన్వేర్టర్ ఉందా? అడిగిందావిడ.
దిమ్మ తిరిగి పోయింది నాకు. అన్నీ తెలిసి, నాకు చెప్పని, మా శ్రీవారు మాత్రం,
చిరునవ్వు వెన్నెలలు చిందిస్తూ చూస్తున్నారు.
'ఏవండి, ఇక్కడ కరెంటు ఉండనప్పుడు, ఎలాంటి గృహోపకరణాలు పని చెయ్యవు. ఇంక పాలు,
పెరుగు, ఇడ్లీ, దోస పిండి అన్నీ, పులిసిపోతాయి. వచ్చి వచ్చి, ఇలాంటి ఊరిలో
పడ్డాం, ఎలా బతకాలో?' అంటూ దిగులు పడ్డాను నేను. నా బెంగ కొంత తీర్చడానికి,
హోటల్ కింద బండి మీద ఇడ్లీ, దోస తెచ్చారు మా వారు. హోటల్ లో ఉన్న వారం
రోజుల్లో, వాడికి ఆలూ ఫ్రాయ్, భెండి ఫ్రాయ్ అన్నీ, నేర్పెసాం. సామాను
వచ్చింది. అంతా దిమ్పించుకుని, సర్దుతుండగా, అట్ట పెట్టెలు ఎక్కడ పడెయ్యాలి,
అన్న సందేహం వచ్చింది. 'మీ ఫ్లాట్ కి, లిఫ్ట్ కి మధ్యలో, ఒక స్ప్రింగ్ డోర్
లాంటిది ఉందే, అదే ఎనిమిదో అంతస్తు నుంచి కింద దాకా ఉన్న పెద్ద గొట్టం లాంటి,
చెత్త బుట్ట. అన్నీ అందులో పడేయ్యచ్చు, కింద పార్కింగ్ లో ఉన్న తలుపు తీసి

,రెండు రోజులకు ఒకసారి పట్టుకుపోతారు, ' చెప్పింది ఎదురావిడ. 'వీళ్ళ కళాహృదయం
మండ, చెత్త వెయ్యడానికి ఇంత సృజన అవసరమా, ' అనుకుంటూ వెళిపోయాను నేను.
వారం రోజులు పట్టింది, అంతా సర్దుకోవడానికి. ఉండి లేనట్టుండే కరెంటు, ఉక్క
పోతకు గుక్కపెట్టే, నా కూతురు, వెనుక రాత్రంతా, గేదెల బ్యాక్ గ్రౌండ్ సంగీతం.
'నాన్నా! గేదె లాగ అరవడం ఎలా?' అడిగింది నా కూతురు. ' అలా కాదమ్మా, 50 %
ముక్కులోంచి, 50 % నోట్లోనుంచి రావాలి, వ్హో ..' అలాగా, అంటూ
నేర్పిస్తున్నారు మావారు. ఎంతయినా వడగాలి లాంటి నా కోపాన్నయినా, చల్లార్చి,
వెన్నెల చలువలా చెయ్యగల చతురోక్తి మా వారిది.




వారం రోజుల తర్వాత, సాయంత్రం నా కూతురిని తీసుకుని బయటపడ్డాను. ఇద్దరు
ఆడవాళ్ళు అటకాయించారు. 'ఎక్కడి నుంచొచ్చావ్ ? హిందీ వస్తుందా? సాయంత్రం ఇంటికి
రా!' అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదటి పరిచయం లోనే ఏమిటి ఇంత కటువుగా
మాట్లాడుతున్నారు, అనుకుంటూ, 'ఎవరండి మీరు, ఎక్కడుంటారు?' అని అడిగాను. 'అలా
ఉంది నీ పరిస్థితి. మేము మీ ఫ్లోర్ లో చివరి ఇంట్లో ఉంటాం. నా పేరు రేణుక.
దీది అని పిలువ్. ఈవిడ ఖాన్న ఆంటీ. మా ఎదురిల్లు. వచ్చాకా ఇంటికి వస్తే,
పరిచయం చేసుకుందాం, అన్నట్టు, ఎక్కడికి వేలుతున్నావ్?'. 'నాకు ఉల్లిపాయ,
వేల్లులిపాయ కావాలండి, కిరాణా కొట్టుకు వెళుతున్నా..', చెప్పాను. 'అవన్నీ
దగ్గరలో దొరకవమ్మా, పైగా కిరాణా లో అసలు దొరకవు. నువ్వు ఇక్కడికి కిలోమీటర్
దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్ళాల్సిందే. రిక్షా ఎక్కి వెళ్లు, మేడలో,
చేతికి నగలున్నాయి, జాగ్రత్త!' అన్నారు. 'ఏంటి ఉల్లిపాయ కోసం కిలోమీటర్ దూరం
రిక్షా ఎక్కి, ఉత్సవ విగ్రహం లా ఊరేగుతూ వెళ్ళాలా! దేవుడా, ఎలాంటి ఊరిలో
పడేసావ్!' అనుకుంటూ బయల్దేరాను.
బయటకు వెళ్లి వచ్చాక, వాళ్ళని కలవడానికి వెళ్లాను. చాలా ప్రేమగా పలకరించారు.
'చూడమ్మా, ఊరు గానీ ఊరోచ్చావ్, యే అవసరం ఉన్నా, మొహమాట పడకుండా అడుగు. ఇక్కడ
నిత్యావసరాలేమీ పక్కనే దొరకవు. అందుకే, నువ్వు బయటకు వెళితే, మాకు కావలిసినవి
తెచ్చి పెట్టు, మేము వెళితే, నీకు కావలసినవి అడుగుతాం. ఇక్కడ పని వాళ్ళు చవుక.
మేము వంత కూడా చేయించుకుంటాం. నువ్వు కూడా పెట్టేసుకో, మనమంతా ఎంచక్కా హౌసి
ఆడుకోవచ్చు,' అన్నారు. చెప్పద్దూ, నాకు డబ్బు పెట్టి ఆడే హౌసి అంటే జూదం
ఆడినట్టు అనిపిస్తుంది. ఒకవేళ తప్పక, ఆడాల్సి వస్తే, ఆ డబ్బు యే
అనాదాశ్రమానికో ఇచ్చేస్తాను కాని, చచ్చినా ముట్టను. అందులోను రోజూ పొద్దుటా,
మధ్యానం , సాయంత్రం ఆడాలట. 'లేదండి, మా వంటలు వేరు. పాపతో నాకు కుదరదు, వస్తూ
వుంటాను, కాని ఆడడం కుదరదు.' అని చెప్పేసాను. 'అయితే మా కిట్టి పార్టీల్లో
చేరు,' అన్నారు. కిట్టి పార్టీ లు 'ఆత్మ స్తుతి, పర నిందా' , లో
సిద్ధహస్తులయిన, ఆధునిక అమ్మలక్కల కోసం మాత్రమే, అని నా గట్టి నమ్మకం. 'మా
వారికి ట్రాన్స్ఫేర్ లు అవుతుంటాయి కదండీ, అందుకే నేను ఎలాంటి వాయిదాలు
పెట్టుకోను,' అన్నాను మర్యాదగా. సరే, టీ తాగు అని ఇచ్చారు. అంతకంటే, కాలకూట
విషం నయం అంటే నమ్మండి. వట్టి నీళ్ళు. 'పంచదార కావాలా?', మేము వేసుకోము అంది.
లేట్ గా చెప్పినా లేటెస్ట్ గా చెప్పిందని సరిపెట్టుకున్నా.
ఇక అక్కడ ఇడ్లీ రవ్వ దొరకదట. బాస్మతి బియ్యం తప్ప మామూలు బియ్యం దొరకదట. దోశలు
వేసినా, పులిహోర చేసినా బిర్యాని తిన్నట్టు ఉండేవి. మరి ఎలా? మొత్తం బిల్డింగ్
లో ఉన్నా ఒకే ఒక్క తమిళియన్ గీత అనే ఆవిడ, నాకు తరుణోపాయం చెప్పింది. చాలా
కాలం క్రిందట అక్కడకు వచ్చి స్థిరపడిన ఒక తమిళియన్ అతను, ఉప్పుడు బియ్యం,
వాడకం బియ్యం, ఇడ్లీ రవ్వ అమ్ముతాడట. ఇంకా తయారుగా రుబ్బిన పిండి కూడా
అమ్ముతాడట. వెంటనే దండయాత్ర చేసి, మూడు కిలోమీటర్లు రిక్షా లో వేసి,
తెచ్చుకుంటున్నా. దారిలో మల్లె పూలు కనబడ్డాయ్. కాని మనలా కాకుండా, వింతగా,
తొడిమలు అన్నీ పీకేసి, ఒకదాని వెనక ఒకటి గుచ్చుతున్నాడు. 'ఎంత?' అన్నాను.
'ఎన్ని మీటర్లు కావాలి?' అన్నాడు. నాకు నవ్వాగలేదు. మల్లెపూలు మీటర్ లలో
అమ్ముతారన్నమాట. కాసిని విడి పూలు కొనుక్కుని, బయలుదేరాను. అక్కడ ఎవ్వరూ పూలు
పెట్టుకోరు. నా అలవాటు నాది, నేను కట్టి పెట్టుకోడమే కాక, అందరికీ ఇచ్చేదాన్ని.
అక్కడి వాళ్లకు మన ఇడ్లీ, దోస అంటే ప్రాణం. ఎక్కడో అరుదుగా అవి దొరికే హోటల్
కి వేల్దుము కదా, ఆ రోజుల్లో, రెండు ఇడ్లీ లు యాభై రూపాయిలు, దోశలు వంద పైనే.
పోనీ కొనుక్కున్న వాళ్ళు హాయిగా చేత్తో తింటారా, అంటే, రెండు ఫోర్క్ లు
పట్టుకుని, దోసను చీల్చి చెండాడి, ఆ చెండాడిన ముక్కలు దొరక్క ఎగిరిపడి, భలే
హడావిడి చేస్తారు. నేను విలాసంగా వాళ్ళను ఉడికిస్తూ, 'అలాక్కాదు, ఇలా తినాలి,'
అన్నటు తినేదాన్ని. దోశ పేరు దోష , సాంబార్ లో చాట్ మసాల వేసినట్టు ఉండేది.
నా పేరు ను 'పదమని', 'పడ్మిని', 'పాద్మిని ' అంటూ, రక రకాలుగా పిలుస్తుంటే..
'తాతా, నోరు తిరగని పేరు పెట్టావు కదా,చూడు ఎలా విధ్వంసం చేస్తున్నారో', అని
తిట్టుకునే దాన్ని. ఒక రోజూ అందరం కలిసి, తలొక ఐటెం చేసుకు తిన్దామన్నారు, మా
ఫ్లోర్ లో వాళ్ళు. నేను వండిన పులిహోర, గారెలు, అల్లప్పచ్చడి, ఎంతో ఇష్టం
గా,మెచ్చుకుంటూ తిన్నారు. ఎదురింట్లో నా ఫ్రెండ్ దీప అయితే, 'నువ్వు ఎప్పుడూ
ఇడ్లీ, దోస చేసినా, నాకు ఇవ్వవూ, చాలా ఇష్టం నాకు ', అనేది. అంతే కాక ఒక
పుస్తకం తెచ్చుకుని, చట్నీలతో సహా ఎలా చెయ్యాలో రాసుకునేది. వాళ్ళు చేసే
రకరకాల వెన్న వేసిన పరోటా లు, రాజ్మా, కడి పకోడా(మజ్జిగ పులుసు లాంటిది),
కిచిడి, అన్నీ నాకు ప్రేమగా తెచ్చి పెట్టేది. పదహారణాల తెలుగు పడతినయిన నా చేత
జీన్స్ కొనిపించి, వేయించిన ఘనత కూడా ఆవిడకే చెల్లింది. కరెంటు లేకపోవడం వల్ల
సాంఘిక బంధాలు, మెరుగ్గా ఉంటాయన్న గొప్ప సత్యం తెలుసుకున్నాను నేనక్కడ.
వాళ్ళంతా పలకరిస్తూ ఉండేవాళ్ళు, వాకింగ్ కు వెళ్ళేవారు, గుడికి వెళ్ళేవారు,
షాపింగ్ లకు వెళ్ళేవారు. అందుకే నాకు అంత వెలితిగా అనిపించలేదు. కాని కరెంటు
లేనప్పుడు మాత్రం హింసే. అదీ, నెలకు మూడు రోజులు కరెంటు లేనప్పుడు, ఉక్కపోత,
గేదెల సంగీతం వింటూ, ఒక యాభై ఏళ్ళు వెనక్కి వెళ్లి బ్రతుకుతున్నట్టు అనిపించి,
ఎక్కడికయినా పారిపోవాలనిపించేది. వేసవిలో వచ్చే గాలి దుమారం లాంటి దుమ్ము
వడగాలి, ఇంకో ప్రత్యేకత. మొదటిసారి నాకు తెలియక, 'హబ్బ, చల్ల గాలి తిరిగిందే',
అని పరవశంగా చూస్తుంటే, ఒక్క సారిగా తలుపులు, కిటికీల లోంచి దుమ్ము గాలి
కొట్టేసి, ఇల్లు, వళ్ళు మట్టి గోట్టుకు పోయాయి. అదంతా శుబ్రం చేసుకునే సరికి,
తల ప్రాణం తోక కొచ్చింది. ఇక్కడ, ఇది మామూలే, దుమ్ము తుఫాను ఎప్పుడొస్తుందో
తెలీదు. కిటికీలు, తలుపులు మూసి పెట్టుకోవాలి, అనేవాళ్ళు. 'కరెంటు లేక,
తలుపులూ మూసుకుని, ఊపిరి బిగబట్టినట్టు ఉండేది.
పైగా, అక్కడి వాళ్ళంతా, పుండు మీద కారం జల్లినట్టు, 'क्या पद्मिनी , मन
लगगया,कानपूर से' అని అడిగేవాళ్ళు. 'మరే, ఇప్పుడు వెళ్ళిపోయే అవకాశం దొరికితే,
మళ్ళి జన్మలో రాకూడదు, అన్నంత గట్టిగా మనసు పారేసుకున్నాను.' అనుకునేదాన్ని.

ఒక రోజూ అక్కడ నా కూతురితో ఆడుకునే, పిల్లాడి పనిమనిషి, 'అక్కా, టెర్రస్ మీదకి
వెళదామా, చాలా బాగుంటుంది,' అంది. 'బిల్దర్ ఇల్లు ఉందట, వెళ్ళకూడదని
చెప్పారే,' అన్నాను. 'అలాంటిది ఏమి లేదక్కా, రండి, నేను తీసుకువేలతా,' అంది.
ఎనిమిది అంతస్తుల పైన బిల్దర్ పెంట్ హౌస్ చూసీ, నాకు నోట మాట రాలేదు. టెర్రస్
మీదే, చుట్టూ మట్టి వేసి, రకరకాల పాదులు, పూల మొక్కలు, వేసారు. మధ్యలో పెద్ద
ఈత కొలను, పక్కన అతని ఇంటి బాల్కనీ లో అల్లుకున్న తీగలు, నందన వనం లా ఉంది.
టెర్రస్ మీది నుంచి, దూరంగా కనిపించే గంగానది, దాని మీద కొత్తగా కడుతున్న
వారధి. కూపస్థ మండూకం లా మగ్గిపోతున్న నాకు, ఏదో కొత్త ప్రపంచాన్ని చూసినట్టు
అనిపించింది. ఆ రోజూ నుంచి, మనసు కలతగా ఉన్నప్పుడు, డాబా పైకి వెళ్లి, గంగా
నదిని చూడడం అలవాటయ్యింది.
వెళ్ళిన 2 -3 నెలలకు కార్ తీసుకున్నారు మా వారు. ఉత్తర ప్రదేశ్ హిందువుల పుణ్య
భూమి. మన ఇష్ట దైవాలయిన, రామ జన్మ భూమి అయోధ్య, కృష్ణుడు పుట్టిన మధుర, అత్యంత
పవిత్రంగా భావించే కాశి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అయినా అభివృద్ధి పరంగా, ఎందుకో
కొంత వెనుకబడి ఉంది. ప్రయాగ లో త్రివేణి సంగమం, నైమిశారణ్యం, అన్నీ చూసీ
వచ్చాం. కాన్పూర్ లో ఊరి చివర ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.
అప్పుడప్పుడూ, అక్కడకు వెళితే, ప్రాస కోసం ప్రయాస పడి మరీ తనే పాటలు, రాసి,
పాడి, సంగీతం కూర్చిన సుమన్ సంగీతం,' సుమనోహరుడవని, సుమనస్కుడవని తెలిసి...'
అంటూ వచ్చేవి..అప్పుడు నేనా పూజారి గారిని బ్రతిమాలేసి, వేరే పాటలు లేవా,
అంటే, లేదండి, ఈ ఒక్క CD నే ఉంది, అనేవారు. ఆపెయ్యండి బాబు, మీకు దణ్ణం
పెడతాను, అంటూ, గొడవచేసేదాన్ని. అక్కడ ఎక్కువ మంది శివ భక్తులు. రోజూ బిల్వ
పత్రాలు ఇంటికి తెచ్చి అమ్మేవాళ్ళు. కొండ మీద శివాలయం, నేను తరచుగా, అక్కడి
వారితో కలిసి వెళ్ళేదాన్ని.
వెళ్ళిన ఏడు నెలలకు, నా పుట్టినరోజుకు, మా వారు నన్ను ఢిల్లీ, ఆగ్రా, మధుర
తీసుకువెలతానన్నారు. మా కార్ లోనే, డ్రైవర్ ని పెట్టుకుని, వెళ్ళాము. అక్కడ
పాన్లు నవలడం ఎక్కువ, ఆ డ్రైవర్ 120 km వేగం తో వెళుతూ, చప్పున డోర్ తీసి,
ఉమ్మేసి, మళ్ళి వేసే వాడు. ఐదు ఆరు సార్లు ఊరుకున్న మా వారు, 'నాయనా, మాకేమి
తొందర లేదు, చక్కగా పక్కకు ఆపుకుని, కరువు తీరా, పాన్ నవులూ, ఉమ్మెయ్యి,
అప్పుడు బయల్దేరి వెళదాం,' అంటూ చెప్పారు. అంతే, మళ్ళి వాడు పాన్ నమిలితే
ఒట్టు. ముందుగా, ఆగ్రా వెళ్ళాము. ఆ రోజూ సెప్టెంబర్ 23 . అంతకు ముందు రోజే,
నేను రెండవ సారి తల్లిని కాబోతున్నానని తెలిసింది. ప్రేమ సౌధమయిన తాజ్ మహల్
చూస్తాను, అన్న ఉత్సాహంలో ఉన్నాను. ఆ రోజూ చాలా ఎండగా ఉంది. తాజ్ మహల్ లోపలికి
చెప్పులతో వెళ్ళకూడదు కనుక, బయటే వదిలేసాం. దారి పొడవునా, ఏవో కార్పెట్ లు
వేసారు, అయినా, కాళ్ళు కాలిపోతున్నాయి. పిల్లని చంకనేసుకుని, లోపలంతా తిరిగాం.
అక్కడేవో, రిపైర్ లు జరుగుతున్నాయి. బయటకు వచ్చేటప్పటికి, దట్టంగా మబ్బులు
పట్టేసాయి. తాజ్ మహల్ వెనుక భాగం వైపుకు వెళుతుండగా, పెద్ద వాన, వానలో యమునా
నది. ఆ పాలరాతి సౌధం వానలో తడిసి, కడిగిన ముత్యం లా మెరిసిపోతోంది. వెన్నెల
వాన, గుండెలో కురుస్తున్నట్టు ఉంది. నేలంతా, జారుడుగా తయారయ్యింది. అక్కడే
నేను, నా కూతురూ, కాసేపు ఆడుకున్నాం. తాజ్ మహల్ వెనుక భాగం వైపు ఉన్న కిటికీలో
దాదాపు అరగంట దాకా కూర్చుని, ఆ బురుజుల్ని, గోడల్ని, నదిలో కురిసే, జలతారు వాన
చినుకుల్ని, చూస్తూ, కూర్చోవడం, ఒక మధురానుభూతి. వాన వెలిసి, బయటకు రాగానే, మా
శ్రీవారి బాస్ ఫోన్, 'సతీష్ నిన్ను ప్రోమోషన్ మీద విజయవాడ ట్రాన్స్ ఫేర్
చేస్తున్నాం, నెల లోపల జాయిన్ అవ్వాలి, సంతోషమేనా' ,అంటూ. ఇంక నా ఆనందం
చెప్పనలవి కాదు. కాన్పూర్ నుంచి వెళ్ళిపోయే అవకాశం అంత తొందరగా రావడం ఒక
పక్కయితే, తిరిగి ఆంధ్ర కు రావడం , అంతకు మించిన ఆనందం.
ప్రతి కొత్త చోట కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆనందాలు ,కొన్ని మరిచిపోలేని
బంధాలు, ఉంటాయి. కాన్పూర్ లో పాని పూరి, కచోరి, లస్సి, ఆలూ చాట్, వీటి రుచి
ఎప్పటికీ మర్చిపోలేము. మిత్రులందరితో కలిసి దాన్దియా కు వేసిన ముగ్గు, చేసిన
సందడి మరువలేము. మేము వేలిపోతున్నామని తెలిసి, నా ఫ్రెండ్స్ అంతా చాలా బాధ
పడ్డారు. చివరిదాకా, సాయపడి, కన్నీటితో వీడ్కోలు పలికారు. ఇప్పటికీ ఫోన్లు,
సందేశాలు పంపుతుంటారు. అకారణంగా, మనపై వారు చూపించే మమతకంటే, ఆప్యాయంగా మనపై
ఉన్న అభిమానాన్ని కన్నీటి చుక్కలుగా మార్చి, కురిపించే స్వచ్చమయిన మనసుల కంటే,
ఈ జీవితంలో సాధించవలసిన విలువయిన పెన్నిధి ఏముంటుంది చెప్పండి?

2 comments:

  1. చాలా రాశారు పాపం. పిచ్చ షాకు కదా, బెంగుళూరు నుంచి పోయి కాన్పూరులో పడ్డం! ఇంకో పూట వచ్చి మొత్తం చదువుతాను. నేణు కాన్పూరు IITలో చదివాను. ఆ స్టేషను, ఆ ఊరు దాటు కేంపస్ లో పడితే స్వర్గం చేరినట్టు ఉండేది.

    ReplyDelete