Thursday, March 14, 2013

కుక్క పాట్లు

ఎందుకో నాకు కుక్కల మీద, కుక్క మమ్మీల మీద, కుక్క డాడీల మీద, అంత ఇష్టం లేదండి. కుక్కల్ని మనుషులతో సమానంగా 

పలకరించడం, గౌరవించడం నాకు తెలీదండి. కుక్కల్ని ముద్దు చెయ్యడం, మూతి మీద ముద్దులు పెట్టడం, భోజనాల బల్ల మీద

ఎక్కించడం, పక్కలో పడుకోబెట్టుకోవడం, నాకెందుకో అసహజంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇంటి సంరక్షణ కోసమో, సరదా కోసమో, లేక 

హోదా కోసమో, కుక్కల్నిపెంచుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. పొద్దుటే, కుక్కల్నేసుకుని వాకింగ్ కు బయల్దేరతారు. అవి , జరగాల్సిన 

పని చూడక, అక్కడా ఇక్కడా వాసన చూస్తూ, యజమానుల్ని పరిగేట్టిస్తాయి. పొద్దుటే, బ్రేక్ ఫాస్ట్ కి ఒక కండ దొరకప్పోతుందా, అని వచ్చే 

పోయే వాళ్ళ వంక చూస్తూ, బెదిరిస్తాయి. 'మొరిగే కుక్క కరవదని', కుక్క బాంధవుల నమ్మకం. కాని, ఆ సంగతి కుక్కకి తెలుసా, దగ్గరికి

వచ్చి గీరడం, నాకడం చేస్తాయి. అది గీరుతుందో, కరుస్తుందో, వాసన చూసి వదిలేస్తుందో తెలియక, బిగుసుకు పోతాను, నేను. తీరా 

కరిచిన్దనుకోండి, 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అంటూ...' దాని యజమానిని ఏమి చెయ్యలేము కదా. మనం కుక్క చావు చావాల్సిందే, అది 

నా భయం.



బెంగళూరు లో సొంత ఫ్లాట్ కొనుక్కుని, అక్కడికి మారాకా, ఎదురింట్లో పెద్ద నక్కంత కుక్క, 'టఫీ ' దాని పేరట. వాళ్ళు నార్త్ ఇండియాన్స్, 

పండు లాంటి చిన్న బాబు.'అదేంటి, అపార్ట్మెంట్ లలో కుక్కల్ని పెంచడం నిషేధించారు కదా, అంటారా? నిషేదిమ్పులూ మనవే, 

సడలిమ్పులూ మనవే. వెళ్ళిన మొదటి రోజే, బిక్క చచ్చిపోయి, దాన్ని చూస్తుంటే, ఇంటాయన దాని పురాణం చెప్పడం మొదలెట్టాడు. 

'స్నిఫ్ఫెర్' జాతి కుక్కట. ఇరవై వేలు పెట్టి కొన్నాడట, దాని అమ్మ, నాన్న, తాత, అందరూ కుక్క చాంపియన్ లట. దాన్ని కొంచం గీకనిస్తే, 

నాకనిస్తే, ప్రేమిస్తే దానంత మంచి కుక్క లేదట. 'బాబు, కుక్క యజమానికి కుక్క ముద్దు... మా పాట్లు మీకేమి తెలుస్తాయి,'

అనుకున్నాను. తలుపు తీసినప్పుడల్లా, నేను, నా చిన్నకూతురు చేసే హడావిడికి, పెట్టే కేకలకి, ఆ కుక్క బెదిరిపోయి, పారిపోయేది.  

ముందర నెమ్మదిగా, టఫీని మచ్చిక చేసుకుంది, నా పెద్ద కూతురు. దగ్గరికి వెళ్లి నిమిరేది. అది మెల్లగా కూర్చుని, ఆనందించేది. చిన్న 

పిల్లలు, కుక్కలతో ఆడి , ఆ చేతులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. పైగా, కుక్కల బొచ్చులో ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి, రోగాలు వచ్చే 

అవకాశాలు ఎక్కువ.

రోజూ వాళ్ళ ఇల్లు చిమ్మితే, దోసెడు కుక్క బొచ్చు రాలి వచ్చేది . ఆవిడ నాకు ప్రేమగా ఏదో పట్టుకోచ్చేది, పైన చూస్తే, కుక్క బొచ్చు, 

మింగలేను, కక్కలేను. వారానికో, పది రోజులకో మాత్రమే దానికి స్నానం. ఒక్కో సారి , భరించలేని, కంపు కొట్టేసేది. మా తలుపు తీస్తే, 

ఇంట్లోకి వచ్చేసేది. నా చిన్న కూతురు స్కూల్ కి వెళ్ళినప్పుడు, దబ్బపండులా ఉండే వాళ్ళ పిల్లాడు,' ఆంటీ, ఇడ్లీ దోస ఖిలాదో, 'అంటూ 

వచ్చేవాడు. నేను తినిపిస్తే, కుదురుగా కూర్చుని తినేవాడు. వాళ్ళ వెనకే, టఫీ వచ్చి కూర్చునేది. ఇంక మా ఇంట్లో అడుగు పెట్టే దమ్ము లేదు 

ఎవరికీ. క్రమంగా, నాకు టఫీ అంటే, భయం పోయింది. నా మాట వినేది, నేను ప్రేమగా నిమిరితే, అందుకోసమే చూస్తున్నట్టు, బుద్ధిగా 

కూర్చునేది. నా చిన్న కూతురు ఉన్నప్పుడు మాత్రం,అది పెట్టే కేకలకు దడిసి, రావడానికి టఫీ భయపడి చచ్చేది. అయితే, నా కూతుర్ని 

ఉడికించడం, దాన్ని చూడగానే, ఆడుకున్దామంటూ, నోట్లో ఒక బంతి పెట్టుకు రావడం చేసేది. అలా మెల్లగా, సమీరకి కూడా టఫీ 

అలవాటయిపోయింది. మొదట్లో టఫీ ని కట్టేస్తేనే కాని, వాళ్ళ ఇంటికి రానని మొరాయించేది, ఇప్పుడు మెల్లిగా దాని మొహంలోకి చూస్తూ, 

అడుగులో అడుగు వేస్తూ వెళ్ళేది, అది కూడా చూసీ చూడనట్టు ఊరుకునేది. అలా మాకు, దానికీ పొత్తు కుదిరింది.

'మీరు దాని అవసరాలు ఎలా కనిపెడతారు?' అడిగానొక సారి. 'అవి చాలా తెలివయిన కుక్కలు, వాటి ఆలోచనల్ని, మన బ్రైన్తో 

అనుసంధానం చేసుకుంటాయి. ఎప్పుడూ తిడతామో, ఎప్పుడూ ముద్దు చేస్తామో, అన్నీ వాటికి తెలుసు, బెట్టు అలకలు, అన్నీ

చేస్తాయి ,' అంది. నేను నమ్మలేదు. కాని అంత త్వరగా వాటి గ్రాహక శక్తికి, నా కాళ్ళ ముందే రుజువు దొరుకుతుందని, నేను అనుకోలేదు. 

ఎదురావిడ మావగారు, అనారోగ్యంతో, పోయారు. వాళ్ళాయన, ముందుగానే ఢిల్లీ వెళ్లారు. తను, పిల్లాడు మాత్రమే ఉన్నారు. 'పద్మిని, 

నాకు కాళ్ళు- చేతులు ఆడట్లేదు. మైల అని తెలుసు, అయినా సాయం చేస్తావా, సర్దుకుంటాను...' అంది ఏడుస్తూ. 'భాభి, మైల -అంటూ 

ఏమి లేవు, మానవత్వాన్ని మించిన నియమం లేదు, పదండి, ' అంటూ వాళ్ళింటికి వెళ్ళాను. తను కుక్కని కేన్నెల్ లో వదిలి వెళ్ళాలి. 

చంటి పిల్లాడిని సముదాయిన్చుకుంటూ, సర్దుకుంటోంది. ఈ లోగా టఫీ ఏడవటం మొదలెట్టింది. 'ఎందుకు ఏడుస్తోంది?' అడిగాను.

'అది, జరిగింది అర్ధం చేసుకునే విజ్ఞత ఉన్న కుక్క. నేను వదిలి వెళతానని, కష్టంలో ఉన్నానని, ఏడుస్తోంది,' అంది. నాకెందుకో, జాలేసింది. 

దగ్గరకి వెళ్లి, 'టఫీ' అన్నాను. ఒక్క ఉదుటన, నా వొళ్ళో తల పెట్టుకుని, బెంగగా చూస్తూ, ఏడ్చింది. నా గుండె కరిగిపోయింది. ఈ సృష్టిలో, 

ప్రేమకి లొంగని ప్రాణి ఉంటుందా చెప్పండి. ఆ మాటకొస్తే, ప్రతి ప్రాణి తపించేది, ఆ గుప్పెడు ప్రేమ, ఆప్యాయత కోసమే కదా. దాని మేధకు, 

ప్రేమకు, నా కుక్క ఫోబియా ఎగిరిపోయింది.

అయినా, ఎంత విశ్వాసం, స్వామి భక్తి ఉన్న జంతువయినా, నేను కుక్కల్ని, చస్తే నమ్మనన్డోయ్ , అన్నీ కుక్కలూ, టఫీ కాదు కదా. మీ 

ఇంట్లో కుక్కుందా... అయితే,దాన్ని కట్టేసే దాకా...నేను మీ ఇంటి దరి దాపులకి కూడా రాను. అందుకోండి నా అభయం.

No comments:

Post a Comment