Wednesday, March 13, 2013

బాపు బొమ్మ

బాపు గారి బొమ్మ మీద చిన్న షికారు...

ఇంతకు మునుపు మేము అద్దెకున్న ఇంటికి, మా అక్క(పెదనాన్న కూతురు) ఇల్లు చాలా దగ్గర. మేము అప్పుడే ఈ ఊరికి కొత్తగా రావడంతో, అక్క నాకు అన్ని విధాలా సాయం చేసి, ఒక పాల వాడిని , కూడా పంపింది. 

మా ఇంటి తలుపు తెరవగానే, మా సీతారాముడు మావయ్యగారు నాకు ఇచ్చిన 4/5 బాపు గారి పెద్ద వినైల్ ప్రింట్ బొమ్మ కనిపించేది. అదే బొమ్మను క్రింద జతపరచాను .  పాలవాడు రోజూ ఆ బొమ్మ కేసి, నాకేసి, మార్చి మార్చి చూస్తుండే వాడు. చివరికో రోజు ధైర్యం చేసి, 'నువ్వు ఆ బొమ్మలో మధ్యలోఅమ్మాయిలాగా ఉంటావమ్మా!' అనేసి, సిగ్గుపడి పారిపొయాడు. తెలుగింటి ఆడపడుచుకి ఇంతకంటే పెద్ద పొగడ్త ఏముంటుంది చెప్పండి ? వెంటనే, నాకు బోలెడు పొగరు వచ్చేసింది . 

మా వారు ఇంటికి రాగానే, వెయ్యి వోల్టుల బల్బ్ లా వెలిగిపోతున్న నా మొహం చూసి, ఏవిటి సంగతి?, అన్నట్టు కళ్ళతోనే సైగ చేసారు. నేను పాలవాడి కాంప్లిమెంట్ గురించి చెప్పాను . వెంటనే, 'చూడమ్మాయ్ , ఇదంతా వాడు నిన్ను ఉబ్బేసి, పాలల్లో నీళ్ళు కలిపి పొయ్యడానికి వేసిన పధకం, పాలదాకా ఎందుకు, చివరికి రేపటినుంచి వాడు నీళ్ళు పోసినా, నువ్వేమీ మాట్లాడవ్ . అందువల్ల, ఇంక పల్లకీ దిగి, పని చూడు, ' అన్నారు. 'మీకు అసూయ,' అంటూ, నేను కొంచం ఉడుక్కున్నాను. 

మర్నాడు, మా ఆక్కతో, ఇదే విషయం చెప్తే, 'పాపం వాడు చాలా మంచాడే.... అమాయకుడు . రోజూ పొద్దుటే వచ్చి, 'అమ్మా , టిఫిన్ తిన్నావా ?' అని అడిగేవాడు . 2-3 సార్లు చూసిన మీ బావగారు, ' వీడు పాలు పొయ్యడానికి వస్తాడా, నీ యోగ క్షేమాలు కనుక్కోడానికి వస్తాడా? , వేడిని మాన్పించేయ్ '.అని విసుక్కున్నారు. వెంటనే నేను, 'మీ కన్నా నయం కదూ, ఏ నాడన్నా , ఉన్నవా, తిన్నావా, చచ్చావా?' అని అడిగింది లేదు కదా, ' అని దేప్పిపోడిచాను. తరువాత చూడాలి నా తిప్పలు. రోజూ లేచిన దగ్గర్నుంచి, నన్ను, 'ఉన్నావా? చచ్చావా?' అని పాతిక సార్లు వెనకబడి అడగడం ...విసిగించేసారంటే నమ్ము.

అంతే అక్కా, అంతే ఈ మగాళ్ళ బుద్ధులు....అంటూ మేమిద్దరం అక్కచేల్లెళ్ళం యుగళ గీతం పాడుకున్నాం...యేదనుకున్నారు?

'రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి...'.

No comments:

Post a Comment