Thursday, March 14, 2013

ఆంధ్రా పారిస్

నాకు పాస్పోర్ట్ లేదండి. పారిస్ వెళ్ళలేను. అందుకే ఆంధ్రా పారిస్ వచ్చాను.
అసలు నేను పుట్టినప్పుడే, అరికాల్లో చక్రాలతో, పుట్టానండి. కాలు ఒక చోట
నిలిస్తేనా? నాన్న గారు బ్యాంకు లో పని చేసేవారు. ఇక చిన్నప్పుడంతా, బ్యాంకు
వారి దయ, మా ప్రాప్తం. ఎన్ని చిన్న చిన్న పల్లెటూళ్ళు తిరిగామో. ప్రతి చోట,
ప్రతి స్కూల్ లో, ఆటల్లో, పాటల్లో, డాన్సు లో, వ్యాస రచనా, వక్తృత్వం, స్కూల్
ఫస్ట్, అన్నీ నాకే వచ్చేవా, అలా, స్టేజి కి ఒక మూల నిల్చుని, వచ్చే ప్రైజ్ లు
తీసుకోడానికి, నా చిట్టి చేతులు, సరిపోయేవి కావు. అందరికీ నేను
సుపరిచితమే. ఇంతకీ ఇక్కడ చిక్కేమిటంటే, ఎవరయినా కనిపించి, 'పద్మిని,
బాగున్నావా?' అంటే, అసలు వాళ్ళు యే ఊరిలో నేస్తాలో, తెలిసేది కాదు. దీనికి
కూడా నేనొక ఉపాయం కనిపెట్టానన్నమాట. ఎవరయినా పలకరిస్తే, 'ఆ , బాగున్నా, ఊర్లో
అంతా బాగున్నారా?' అని అడిగేదాన్ని. వాళ్ళు వెంటనే, అక్కడి మాష్టారులు,
స్కూల్, నేస్తాల కబుర్లు చెప్పడం మొదలుపెట్టగానే, యే ఊరో తెలిసిపోయేది. ఇలా
చిన్న క్లాస్సుల వరకు, ఎన్ని ఊర్లు తిరిగినా , ఇబ్బంది ఉండేది కాదు. ఇక మేము
కాలేజీ చదువులకు వచ్చాకా, నాన్న గారు 'ఆంధ్ర పారిస్' లో ఒక ఐదేళ్ళు ఉండి,
ఇక్కడే మమ్మల్ని చదివించారు. అలా నా ఇంటర్, డిగ్రీ, చదువులు ఇక్కడే గడిచాయి.
నిన్న రాత్రే, మా అమ్మ, 'ఏమే, ఆ శివలింగం పూల చెట్టు వాళ్ళతో మాట్లాడి
పెట్టాను, నీకు 108 పూలు కావాలి కదా, పొద్దుటే, ఐదింటికే లేచి, స్నానం చేసి
వెళితే, కోసుకోమన్నారు,' అంది.' అమ్మ, అన్నీ పూలు దొరుకుతాయా? అయినా, పొద్దుట
ఐదింటికి, పళ్ళు తోముకు వెళ్ళడమే ఎక్కువ. కావాలంటే, స్నానం చేసి వెళ్ళినంత
బిల్డ్ అప్ ఇస్తా లే!' అన్నాను. పొద్దుటే, లేపగానే, కళ్ళు విడలేదు, అయినా పూల
కోసం తప్పదు కదా, 'వచ్చాక, మళ్ళి పడుకోవచ్చులే, 'అనుకుంటూ,లేచి బయల్దేరాను.
మేము ఇదివరకు, ఆ చెట్టు ఎదురింట్లోనే ఉండేవాళ్ళం. ఆ చెట్టు కాయలు, ఇనుప
గోళాల్లా ఉంటాయి. పాపమెంత పెరిగితే, ఆ చెట్టు పూలు అంత పైకి పూస్తాయని,
అనేవాళ్ళు. పువ్వులన్నీ, క్రిందికే ఉన్నాయి, అంటే, పాపం ఇంకా అందుబాటులోనే,
ఉందన్నమాట. చెట్టుకు, గండుచీమలు, తేనెటీగలు. విచ్చి విచ్చని నాజూకు పూలు,
కొన్ని కోస్తున్డగానే, రెక్కలు రాలిపోతున్నాయి. సింధూరం, పసుపు పచ్చ
కలిపినట్టుండే, ఐదు రేకల పువ్వులో, తెల్లటి పాముపడగా, పడగ మీది కేసరాలు, పడగ
లోపల, శివలింగం. ఆ పువ్వుల నుంచి వచ్చే, యే అత్తర్లు ఇవ్వలేని, గమ్మత్తయిన లేత
పరిమళం. ఇన్ని వర్ణాలు, అందాలు కాళ్ళ ముందు నిలిపిన ,భగవంతుడి కంటే
,అద్భుతమయిన సృజన ఉన్న కళాకారుడు ఎవరు? చూస్తుండగానే, బుట్టలు నిండిపోయాయి.
నాకు చెట్టు మీదికి ఎక్కే శ్రమ లేకుండానే, కావలసిన పూలు కోసుకు బయట పడ్డాను.
ఇంక ఆ పూల వాసన, మెరిసే రంగు, చూస్తుంటే, నిద్ర ఎగిరిపోయింది. అంతే, 'సీత మంచి
బాలిక' లాగా, బుద్ధిగా తయారయ్యి, పూజ చేసేసుకున్నాను. ఇంతలో జోరు వాన.
నిన్నంతా, ఎండిన నెల తడిసి, గమ్మత్తయిన మట్టి వాసన. గన్నేరు పూల చెట్టు
పైనుంచి కురిసే వాన, గన్నేరు పూల పరిమళాన్ని మోసుకొస్తే, పొగడ పూల వాన, అదే
వాసన వ్యాపిమ్పచేస్తోంది. అలా గొడుగేసుకుని, బయటికి వెళ్ళాను కదా, రోడ్ల
మీదంతా, రాలిన పువు రెక్కలు. ఐదేళ్ళు పొద్దుటే, క్రమం తప్పకుండా, ఐదింటికే
వెళ్లి కూర్చుని, ప్రదక్షిణాలు చేసిన చిన్న బాబా గుడి. ఆ వయసులో, నాకు భక్తీ,
పూజ, ధ్యానం ఏమి తెలీదు. ఒక స్థంబాన్ని ఆనుకుని మౌనంగా కూర్చున్న నాకు,
ఏకాగ్రత, ధ్యానం, సంస్కారం, సన్మార్గం, నా సద్గురువే, నేర్పించారు. ఎదుటివాడు
ఎంత నొప్పించినా, సన్మార్గంలోనే నడవాలనే, నా తొలి అడుగులు సాయి పదంలో నడిచింది
ఇక్కడే. అదే చోట కాసేపు కూర్చున్నాను. దారిలో మేము అంతకు ముందు ఉన్న ఇల్లు
వచ్చింది. ఆ ఇంట్లో ఒక గోరింటాకు చెట్టు ఉండేది. ఒక సారి ఎర్రగా పండిన నా
చేతుల్ని, మా అమ్మమ్మ చూసీ, ముద్దు పెట్టుకుని, 'నీకు మంచి మొగుడు వస్తాడే!'
అంటూ ,అదే ఇంట్లో ఉండగా, మురిపెంగా, అంది. ఇప్పుడు ఆ గోరింటాకు ఎరుపు లేదు,
మా అమ్మమ్మా లేదు, మా మంచి శ్రీవారు తప్ప. అయినా, ఆ అనుభూతి పదిలం.



బావి లాంటి రెసిడెన్షిఅల్ కాలేజీ లో, కప్పలా నన్ను పడేసినా, తీసేసిన జుఅలజి
లెక్చరర్ ని మళ్ళి పెట్టే దాకా, ఉద్యమం లేవదీసి, నేను అందరితో కలిసి గొడవ
చేసింది ఇక్కడే. 'ఝాన్సీ రాణి లా ఉద్యమాలలో చూపే చొరవ, చదువులో చూపించు', అని
మా డైరెక్టర్ తిట్టినప్పుడు, తెలుగు మాధ్యమం లో పడవ తరగతి చదివిన నేను, కాలేజీ
ఫస్ట్ వచ్చి, తిట్టిన ఆయన నోటి తోనే, పోగిడిన్చుకున్నది, ఇక్కడే. ఆకతాయిల,
పోకిరీల వేధింపులు తప్పుకుంటూ, రొజు 3 km లు కాలేజీ కి సైకిల్ తొక్కుకుంటూ,
పడిపోతామేమో అన్నంత భయపెట్టే, కాలువ పక్క ,సన్న రోడ్డులో, వెళ్లి డిగ్రీ
చదివింది, ఇక్కడే. జలగల్ని, బొద్దిన్కల్ల్ని, చేపల్ని, డిసేక్షన్ చేసిన రోజున,
'అమ్మ, అన్నం కలిపి పెట్టవూ, ఈ రొజు నా చేతులు నాకే జుగుప్సగా ఉన్నాయి,' అంటే,
ఎటువంటి షరతులు, సంకోచాలు లేని అమ్మ ప్రేమ, గోరు ముద్దలు తినిపించింది ఇక్కడే.
ఎన్నో బహుమతులు గెలుచుకు, కాలేజీ 1st వచ్చిన ప్రతి సారి, అమ్మానాన్నలు,
గర్వంగా చెప్పుకున్నది, ఇక్కడే. కాలేజీ లోని సైకాస్ చెట్లు, మందార గుబురులు,
చిన్ని కొలనులో కలువల్ని, ఆరాధనగా చూసింది ఇక్కడే. ఈ ఊరు పెద్దగా మారలేదు.
ఇప్పటికీ, గుమ్మాలకి ముందు మేకులకి, తగిలించిన ఎర్ర మందార తోరణాలు, ఇంటి
ముందరి ముగ్గులు, అవే వీధులు, వీధుల్లో, లేత గులాబి రంగులో, చిగురుటాకులు
వేస్తున్న పెద్ద రావి చెట్లు, అదే మనుషులు, మాటల్లో అదే యాస.
అపార్ట్మెంట్ సంస్కృతి లో మగ్గిపోతున్న నాకు, ఈ గాలి, నేల, ఎందుకో కొత్త
ఊపిరులు పోస్తున్నట్టు ఉంది. మళ్ళి ఈ ఊరు వస్తానని , ఇవన్ని చూస్తానని ,
అనుకోలేదు. ఇక్కడి గాలి, నీరు రాసిపెట్టి ఉన్నాయేమో. ఒక విత్తనం, మొక్కగా,
చెట్టుగా మహా వృక్షంగా ఎదిగి, కొమ్మలు, ఆకులూ, పువ్వులూ, పళ్ళు, వేసి
విస్తరించినా, వేళ్ళు భూమిలోనే ఉన్నట్టు, నా ఆత్మ మూలాలు, ఇక్కడే పదిలంగా
ఉన్నాయేమో. అందుకే నాకు నగరం, నగరం లోని విలాస జీవితం ఇవ్వలేని అనుభూతిని, ఈ
పరిసరాలు ఇస్తున్నాయి...

No comments:

Post a Comment