Saturday, February 2, 2013

సంఘ సేవ


సంఘ సేవ 

ఇద్దరు భార్యా భర్తలు, పెళ్లి కాగానే, సమాజం కోసం పోరాడాలని
తీర్మానించుకున్నారు. ఎక్కడ సమస్య ఉంటే, అక్కడ ఆగి, అది తీరే దాకా,
బైటాయిస్తారు. ఎవరికి వారే, తమ దాకా రాలేదు కదా అని ఊరుకుంటే సమస్యలు తీరవని,
'నేను సైతం...' అన్న సిద్ధాంతాలు పాటిద్దామన్న కొత్త మోజు, అదన్నమాట. సరదాగా
వీళ్ళ పేర్లు సీతా- రాముడు అనుకుందాం. వీళ్ళు ఇద్దరూ కాక, ఇంట్లో వీళ్ళకి
తోడుగా ఒక బామ్మగారు ఉంటుంది. మరి వీళ్ళ కధ ఎలా ఉందో చూద్దామా...
ఆఫీసుకని బయల్దేరతాడు రాముడు. దారిలో ఎదురుగా హెల్మెట్ పెట్టుకోకుండా
వెళుతున్న ట్రాఫ్ఫిక్ పోలీసును ఆపి, బండి తాళాలు లాక్కుంటాడు. 'ఏందీ బే,
దాదావా ? మీడియా నా?' శ్రావ్యంగా అడుగుతారు వారు. 'మరి మేము రూల్స్
పాటించకపోతే, ఇలాగే చేస్తారుగా, ఒక పౌరుడిగా అడిగే హక్కు నాకుంది,' అన్నారు
రాముడు గారు. ఈ లోపు చుట్టూ ఎనిమిది మంది పోగయ్యారు. అంతా కలిసి, పోలీసును
విడవమని, రాముడిని తిడుతున్నారు. ఎంత రాముడయినా, ఆ తిట్లకి రాముడిలో ఉన్న
రాక్షసుడు, నిద్ర లేచి, ఆవలించి, వొళ్ళు విరుచుకుని, జూలు విదిలించి, చివరికి
బూతులకి దిగుతాడు. కట్ చేస్తే, చుట్టూ ఉన్న ఎనిమిది మంది, మఫ్తి లో ఉన్న
పోలీసులట. యునిఫోరం లో ఉన్న పోలీసును తిట్టినందుకు గాను, మెత్తగా తన్ని,
బొక్కలో తోస్తారు. ఎలాగో బయట పడి, ఎంతయినా హెల్మెట్ పెట్టుకోనందుకు, పోలీసు
మీద చర్య తీసుకోమంటూ లేఖ రాసి, ఇస్తాడు రాముడు. ఏదో మార్పు సాధించాను
అనుకున్న రాముడికి అందని ఆలోచన ఒకటే. పోలీసు లో తను తెచ్చిన ఆ మార్పు శాశ్వతం
కాదని, నిజానికి అవసరంలో యే మనిషయినా ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేస్తాడని.
కూరాలకి మార్కెట్ కి బయల్దేరుతుంది సీత. ఒక రోడ్డు, బాగా గోతులు పడి,
అసౌకర్యంగా ఉంటుంది. వెంటనే అక్కడ బైటాయిస్తుంది సీత. మీడియా వాళ్ళు
గుమికూడి, ట్రాఫ్ఫిక్ నిలిచి పోవడంతో, ఆడ పోలీసులు సీత ను పట్టికెళ్ళి,
స్టేషన్ లో వేస్తారు. అక్కడ కూడా, 'ఆ రోడ్డు వెయ్యాలి...' అని నినాదాలు
చేస్తూ, నిరాహార దీక్ష చేస్తుంది సీత. మొత్తానికి రోడ్డు వేసాకా, బయటకి
వస్తుంది.




ఇక ఇంట్లో బామ్మ గారు, వీళ్ళిద్దరూ కనబడక ఆందోళన పడుతూ ఉంటారు. రాముడు
రాగానే, 'ఒరే నెల తక్కువ వెధవ, ఎక్కడ చచ్చవురా? ఎంత కంగారు పడ్డానో తెలుసా?'
అంటూ మందలిస్తుంది. అది కాదే బామ్మ, రూల్స్ పెట్టే వాళ్ళే పాటించకపోతే ఎలా,
అంటూ జరిగింది చెప్తాడు రాముడు. 'ఆహా, ఆ పోలీసు మీద చర్య తీసుకోమని ఉత్తరం
ఇచ్చావా, ఆ ఉత్తరానికి రెక్కలొచ్చి, చెత్త బుట్టలోకి ఎగురుంటుంది . లేక నీ
తృప్తి కోసం ఏదయినా చర్య తీసుకున్నా, అది మొక్కుబడికి మాత్రమే. తిన్నగా
ఉండకపోతే, రేపు,' రాగాల పల్లకిలో.... నా ఉద్యోగం పోయిందే బామ్మ...' అని
పాడుకుంటూ రావాలి. అని చెప్తుండగా సీత వస్తుంది,' ఏమ్మా! అసలే ఊరు కొత్త,
ఎక్కడికి వేలిపోయావో అని ఎన్ని చోట్ల వాకబు చేసానో. ఇలా చెప్పా- పెట్ట కుండా
వెళితే, రేపు మీ వాళ్లకి నేను ఏమి సమాధానం చెప్పాలి?' అంటూ కోప్పడింది బామ్మ.
సీత చెప్పింది విని, 'అయ్యో వెర్రి తల్లి, ఆ చింత చెట్టు సందులో నిన్న కష్టపడి
పోరాడి నువ్వేయించిన రోడ్డు, తెల్లారే, టెలిఫోన్ వాళ్ళు తవ్వేసారు. మళ్లీ ఇసక,
కంకర కలిపి కప్పేసారు. మళ్లీ ఇంకొకళ్ళు తవ్వేస్తారు ఈ నగరంలో జీవితాలకు లాగే
రోడ్లకు గారంటీ లేదే!' అంది.
'చూడండి, సంఘ సేవ, పోరాటాలు ఈ రోజుల్లో , కడుపు నిండిన వాళ్ళకే గానీ, దిన దిన
గండంగా బ్రతికే మన లాంటి మధ్య తరగతి వాళ్లకు కాదు. ఈ దేశంలో అడుక్కొక సమస్య.
వీధికొక సమస్య. లంచగొండి తనం, స్వార్ధం, మోసం, దొంగతనాలు, కుంభకోణాలు, నేరాలు
పాతుకు పోయిన ఈ సమాజంలో మీరు ఎంత మార్పు తేగలరు? తెచ్చినా ఎప్పటికప్పుడు
మారిపోతున్న ఈ సంఘంలో మీరు తెచ్చే మార్పు ఎంత కాలం నిలబడుతుంది? ఒక సమస్య
పూరిస్తే, దాని వెనకే వంద సమస్యలు పుడతాయి. ఎన్నని పరిష్కరిస్తారు? మనని మనం
పోషించుకుంటే, మెరుగు పరచుకుంటే, ఇతరులకి ఇబ్బంది కలగకుండా బ్రతికితే, అంతకు
మించిన సంఘసేవ లేదు, తన్ను మాలిన ధర్మం, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే నీతి,
పెద్దలు ఊరికే చెప్పలేదు. తెలిసిందా,' అంటూ గీతోపదేశం చేసింది వృద్ధ బామ్మ

No comments:

Post a Comment