Saturday, September 8, 2012

కార్యక్రమ నిర్వహణ


ఈవెంట్  మానేజ్మెంట్


ఏ వ్యక్తికయినా కొన్ని పనులు స్వప్రయోజనానికి చెయ్యవలసి వస్తుంది, కొన్నిమొహమాటానికి చెయ్యవలసి 

వస్తుంది. అలా ఓ కార్యక్రమ నిర్వాహుకల చుట్టమయిన 'ఈవెంట్ మేనేజర్' --త్రివిక్రమ్ కి, మొహమాటానికి 

వప్పుకుని, ఒక కార్యక్రమం నడపవలసిన అవసరం ఏర్పడింది. ఆ కార్యక్రమం ద్వారా వచ్చే నిధులు 'గిరిజన

సంక్షేమానికి' విరాళంగా ఇవ్వడం జరుగుతోంది కనుక, ప్రచారం కోసం రాజకీయ నాయకులు, స్వామిజిలు విరివిగా 

వస్తారు-- అలా తనకు కొంత లాభం ఉండకపోదులే, అనుకున్నాడు త్రివిక్రమ్.

'గిరిజన సంక్షేమ నిధులు' సేకరించే కార్యక్రమం కనుక-- జానపద నాట్యం, తోలు బొమ్మలాట, కోలాటం, సమూహ 

నృత్యాలు , చిందు నృత్యాలు వంటివి ఏర్పాటు చేసారు. మధ్యలో గిరిజన పిల్లల విన్యాసాలు, జానపద గీతాలు, 

నృత్యాలు ఏర్పాటు చేసారు. కార్యక్రామాలన్ని ఒక క్రమంలో రాసుకుని, వ్యాఖ్యానాలు కూడా రాసుకుపెట్టుకున్నాడు 

త్రివిక్రమ్. 'ఈవెంట్ మానేజ్మెంట్' లో ఉన్న పెద్ద లొసుగు ఏవిటంటే, అనుకున్న అతిధుల కంటే, తిది వార నక్షత్రాలు 

లేకుండా వచ్చే అనుకోని అతిధులే! పైగా అతిధులు ఊరికే వస్తారా-- బుర్ర నిండా బోల్డు సృజనాత్మకమయిన

అవిడియాలతో వస్తారు. వీళ్ళని - వీళ్ళ అవిడియాలని, ఎదుర్కోవడమే పెద్ద సవాల్!



గిరిజనులు అమ్మయకులు- నగర పోకడలు, ప్రవర్తనా నియమాలు తెలియని వాళ్ళు. చెట్టుకి- పుట్టకి ఒక్కళ్ళుగా 

అటూ- ఇటూ పొతే వెతకడం కష్టమని, అందరినీ, వేదిక పైనే ఒక మూలగా కూర్చోపెట్టారు. ముందుగా వినాయకుడి 

ప్రార్ధనా గీతం మొదలయ్యింది... ఈ లోపల ప్రముఖ స్వామీ 'గడబిడానంద' విచ్చేశారు. పాడుతున్న అమ్మాయి 

దగ్గర మైక్ లాక్కుని, స్వామిజిని వేదిక మీదకు ఆహ్వానించాడు త్రివిక్రమ్. ఆయన ఉబ్బిపోయి, మైక్కాసురుడిలా 

మైక్ లాక్కుని ప్రసంగం మొదలెట్టాడు. అలా వినాయకుడి ప్రార్ధన అర్ధాంతరంగా ముగిసింది. స్వామిజి సృష్టి

రహస్యాలన్నీ చెబుతున్నారు. గిరిజనులు గోళ్ళు గిల్లుకుంటున్నారు. అలా ఆయన ప్రవచనాలు జరుగుతుండగా, 

ప్రముఖ రాజకీయ వేత్త - ప్రలొభ్ విచ్చేశారు. త్రివిక్రమ్ స్వామిజి దగ్గర మైక్ , ఆఫ్ చేయించి, రిమోట్ మైక్ తో ప్రలొభ్ 

ని స్వాగతించి, మైక్ అందించాడు. డబ్బు భాష తప్ప యే ఇతర భాష సరిగ్గా రాని ప్రలొభ్ విషయానికి- విషయానికి 

సంబంధం లేకుండా, ఆవు వ్యాసం చెప్పినట్టు, ' గిరి జనులు అంటే, ఆటవికులు, వీరికి వారి సంక్షేమం తెలియదు 

కనుక -- మనము వారిని రక్షించేదము. వాళ్లకి వేసుకోడానికి బట్టలు లేక ఆకులు కట్టుకుందురు-- అందుకే

మనము ఉదారముగా మన బట్టలన్నీ విప్పి వారికి ఇయ్యవలెను..' అని చెప్పుకుంటూ పోతున్నాడు. ఇద్దరు గిరిజన 

స్త్రీలు వేదికపై పేలు చూసుకోవడం మొదలెట్టారు. ఒక పిల్ల వాడు ప్రలొభ్ మాటలకు తిడుతున్నాడని భయపడి, 

ఎడుపులంకిన్చుకున్నాడు. సమయానికి ప్రముఖ సిని నిర్మాత 'దైవాధీనం' రావడంతో ప్రలొభ్ మైక్ ఆఫ్ చేసి-

దైవాదీనానికి అందించాడు త్రివిక్రమ్. 'చూడండి- ఎంత కష్టపడ్డా, సినిమా ఆడుతుందో లేదో చెప్పలేం. అంతా 

దైవాధీనం. అలాగే గిరిజనులు ఎంత కష్ట పడ్డా, కడుపులు నిండక బాధ పడుతున్నారు. వీళ్ళందరికీ సినిమాల్లో 

జూనియర్ నటినటులు గా అవకాశాలు ఇప్పించాలి. రైతు బజార్ లాగా 'గిరిజన బజార్' ఏర్పాటు చెయ్యాలి...' అని

చెప్పుకుంటూ పోతున్నాడు. ఇద్దరు గిరిజన పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో కొట్టుకున్నారు. వాళ్ళ అమ్మలు వేదిక 

మీద పోట్లాడుకోసాగారు. తోలు బొమ్మల కళాకారుడు తన చిట్టి బొమ్మలను పిల్లలకు ఇచ్చి ఊరుకోబెట్టాడు.


ఇంతలో ప్రముఖ వ్యాపారవేత్త ' కిటుకులరావు' వచ్చాడు... మళ్లీ ప్రసంగం... త్రివిక్రమ్ కి మతి పోతోంది... అతను 

రాసుకున్న కార్య- క్రమం అంతా సక్రమంగా కాక, గందర గోళంగా తయారయ్యింది. ప్రేక్షకుల్లో అసంతృప్తి 

మొదలయ్యింది. కొంత మంది టొమాటోలు- గుడ్లు కొనుక్కు తెచ్చుకోడానికి వెళ్లారు. పదో నెంబర్ ప్రమాదసూచిక 

గమనించిన త్రివిక్రమ్, గట్టిగా జుట్టు పీక్కుని, పక్క వాడి జుట్టు కూడా పీకి, పెద్దగా పొలికేక పెట్టాడు. అతడి   

దురదృష్టం, కోయ భాషలో అది నృత్యానికి, నాయకుడి అనుమతి సంకేతం కావడంతో--- గిరిజనులంతా, 

ఊకుమ్మడిగా లేచి నృత్యాలు చెయ్యసాగారు. ఒకే వేదికపై ఒక పక్క కోలాటం, ఒక పక్క సామూహిక నృత్యం, ఒక 

పక్క తోలుబొమ్మలాట... ఉన్న స్థలం లో చక్కగా అమరి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, లయబద్ధంగా నృత్యం 

చేస్తుంటే, ఎల్లలు తెలియని అడవి నెమళ్ళు, హరివిల్లు రంగుల్లో మునిగి, వేదికపై ఒకేసారి నృత్యం చేస్తున్నట్టు-- 

ప్రేక్షకులు మంత్రముగ్డుల్లా చూడసాగారు. మొత్తానికి ఆ కార్యక్రమం క్రమం తప్పి, అనుకోని మలుపులు తిరిగి,

ఊహించనంత విజయవంతమయ్యి-- ' త్రివిక్రమ్' కి మంచి పేరుప్రతిష్టలు తెచ్చి పెట్టింది. గండం గట్టేక్కినందుకు 

దైవానికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు ,త్రివిక్రమ్.

Friday, September 7, 2012

హింస- అహింస



హింస- అహింస 


ప్రాణ భయంతో పారిపోయిన ఒక ఫ్యాక్షనిస్ట్ 'రాజు' గారు, అజ్ఞాతవాసానికి నాటకాల కంపెనీని ఎన్నుకున్నాడు.

ఆ నాటకాల వాళ్ళు మరిచిపోయిన మన పురాణాలలోని మహనీయులని గురుతు చేసే అద్భుతమయిన

కధలు ఎన్నుకుని, సంభాషణలు రాసుకుని, నటిస్తున్నారు. రాజు గారు మాంచి ఒడ్డు, పొడవు, వారి గొంతులో 

గాంభీర్యం ఉండడంతో, వారినే హీరో గా ఎన్నుకున్నారు.జీమూతవాహనుడి కధ. చీమకి కూడా అపకారం 

తలపెట్టడు ఈ మహానుభావుడు. తనను కుట్టిన చీమను కూడా ,తీసి పక్కన పెడతాడు. భూతదయ, కరుణ 

మేళవించిన అద్భుత మూర్తీ.గరుడునికి బలిగా రోజుకొక్క నాగు సమర్పించాబడాలి. ఆ రొజు 'శంఖచూడుడు' అనే

నాగు వంతు. మలయ పర్వతం మీద విలపిస్తున్న శంఖచూడుడి తల్లి నుంచి వివరాలు తెలుసుకున్న 

జీమూతవాహనుడు, కరిగిపోయి, తానే గరుడునికి బలిగా వెలతానంటాడు. తాను చీల్చుకు తింటున్నా, యెంత 

మాత్రం భయం లేక ఆనందంగా ఆహారం అవుతున్న వ్యక్తిని చూసి, గరుడుడు దివ్య దృష్టితో తన తప్పు 

తెలుసుకుంటాడు. గౌరీ దేవి అనుగ్రహంతో,జీమూతవాహనుడు పునర్జీవితుడవ్వడమే కాకుండా, అంతవరకూ 

గరుడుడు భక్షించిన నాగులు కూడా, సజీవమవుతాయి. గరుడుని పగ చల్లారుతుంది. జీమూతవాహనుడి 

హృదయంలోని దయ,కరుణ, నాగులకు శాపవిముక్తి కలిగించి, గరుడుని పగను కూడా ప్రేమగా మార్చింది.

ప్రేమ లోని దివ్యత్వం ఇదే!





ఇక ఈ కధలో మన రాజు గారు ఎలా ఇమిడారో చూద్దామా?

ముందుగా జీమూతవాహనుడి అహింసా తత్వాన్ని చూపడానికి, ఒక గండు చీమను రాజుగారి మీదకు 

ఎక్కించారు. దాని ఖర్మ కాలి అది రాజు గారిని కుట్టింది. పౌరుషం తన్నుకోచ్చిన రాజుగారు...వీపు వెనుక నుంచి 

కత్తి లాగి, ' కత్తితో కాదే, కంటి చూపుతో చంపేస్తా!' అన్నారు... ఈ లోపు తెర వెనుక నుంచి , 'అయ్యా, ఇది చంపే

పాత్ర కాదు...భూత దయ, దాని వంక ప్రేమగా చూసి, బల్ల మీద వదలాలి...' అన్నారు. ఒక్కసారి శత్రువులు, 

ప్రాణభీతి గుర్తొచ్చిన రాజుగారు, చీమను బల్ల మీద వదిలి, ఎవరూ చూడకుండా దాన్ని పిడికిలితో గుద్ది 

చంపేశారు..తరువాత సన్నివేశం మలయ పర్వతం మీద 'శంఖచూడుడి' తల్లి ఏడుస్తూ ఉంటుంది... ఈయన

వోదార్చాలి... 'నా బిడ్డను ఇవాళ గరుడునికి బలి ఇవ్వాలి..' అంటూ వలవలా ఏడుస్తోంది నటీమణి. 'ఛీ! వంట్లో చేవ 

చచ్చినట్లు అట్ట ఏడవడం కాదు... కత్తికి కత్తి... తలకు తల...రక్తానికి రక్తం... ప్రాణానికి ప్రాణం... ఇప్పుడే ఆ

గరుడుడి సంగతి చూస్తా..' అంటూ చొక్కా మడత లోంచి, గన్ తీసాడు... హడిలిపోయాడు స్త్రీ పాత్రధారి. 

పారిపోతుండగా, విగ్ ఊడిపోయింది. అసంకల్పిత ప్రతీకార చర్య లా వెంటనే తెర దించేసి, ప్రేక్షకులని బుజ్జగించి, 

రాజుగారిని బాగా ప్రసన్నం చేసుకుని, ఆయన వంటి మీద ఉన్న మారణాయుధాలు అన్నీ తీసుకుని, మళ్లీ తెర 

ఎత్తారు. ఈ సారి గరుడుడు ముక్కుతో పొడుస్తుంటే, జీమూతవాహనుడు నవ్వుతూ చూడాలి. ఎంతో ఇష్టంగా 

ఆహారం అవ్వాలి. గరుడ పాత్ర ధారి ఆకాశం నుంచి, బెదురుగా, తాడు సహాయంతో, వేలాడుతూ వచ్చాడు. 

'వచ్చినావురా.. దా చూసుకుందాం నీ పెతాపము నా పెతాపమూ...నేను తొడ కొడితే, ఆ సౌండ్ కే గుండె ఆగి 

చస్తావు నువ్వు..' అంటూ మొదలుపెట్టారు రాజు గారు. 'ఓహో, కత్తులూ, గన్ లు లాక్కోగలం కాని, ఈ తొడ 

సంగతి ఎందుకు తట్టలేదబ్బా ! ' అనుకుంటూ, తెర వెనుక నుంచి, దణ్ణాలు పెడుతూ, సైగ చేసారు నాటకం 

వాళ్ళు. వెంటనే రాజుగారు చల్లబడి, మౌనంగా కూర్చున్నారు. గరుడ పాత్ర ధారి భయపడుతూ, 'హ హ హ... ఈ 

విషపు నాగు ఇవాళ నాకు ఆహారం అగుట తధ్యము...' అన్న అతని డైలాగ్ చెప్పాడు. ఎటు నుంచి పొడవాలో 

తెలియక అయోమయంగా చూస్తున్నాడు. ఆసరికే అతని మాటలకు ఆవేశం తలకెక్కిన రాజుగారు, 'చూడు, ఒక 

వైపే చూడు.. రెండో వైపు చూడకు... తట్టుకోలేవు...' అంటూ అతడు వేళ్ళాడుతున్న తాడును మొలలో దాచిన 

చిన్న కత్తితో కోసేశారు. వళ్ళు మండిపోయిన నాటక సమాజం వాళ్ళు రాజుగారిని, ప్రేక్షకుల్లోకి తోసేసారు. హింస 

ఎంత హింసాత్మకంగా ఉంటుందో , దేహశుద్ధి చేసి, చేతల్లో చూపించారు ప్రేక్షకులు.

పందెం


పందెం 




మరదలు అనంతలక్ష్మీ(అల) అంటే పంచప్రాణాలు కౌస్తుభానికి(కౌషి). పెళ్లి చేసుకోమని బతిమాలుతున్నాడు. 

మరి అల గడుసు పిల్ల, హాస్యప్రియురాలు. చిన్నప్పుడు శ్రీలక్ష్మి కామెడీ అంటే పక్కవాళ్ళ చెవులు కోసేసేది. బావ 

అంటే ఇష్టమున్న, అడగ్గానే వప్పేసుకుంటే లోకువ కనుక చిన్న పరీక్ష పెట్టింది. ఒక రోజంతా, పొద్దుట లేచిన దగ్గరి 

నుంచి, యే వస్తువు చేతిలో ఉంటే, దాని తాలూకు ప్రకటన నటిస్తూ చెప్పాలి. ఈ వస్తువులన్నీ స్వయంగా అల 

ఎంచి మరీ పెడుతుంది. ఒక వేళ ఏదయినా ప్రకటన చెప్పలేకపోతే, పెళ్లి కుదరదు. సాయంత్రానికి మాత్రం కౌషి కు 

నచ్చిన ఒక ప్రకటనలో నటించి మెప్పించవచ్చు. బావా- మరదళ్ల సవాళ్లు ఇంట్లో వారికీ వినోదమే కనుక అందరూ 

సమ్మతించారు.



పొద్దుటే కాల్గేట్ డెంటల్ క్రీం తో సిద్ధంగా ఉండి అల. ఎంతో ఆలోచించి, 'వెచ్చని తాజా శ్వాస కోసం కాల్గేట్ డెంటల్ 

క్రీం...పళ్లకు చిగుళ్ళకు ఆరోగ్యము కాల్గేట్ డెంటల్ క్రీం...' అని పాడాడు కౌషి. అల నవ్వింది. వెంటనే కాఫీ 

అందించింది, ' ఫిల్టర్ కాఫీ నా? , లేదండి బ్రు ఇన్స్టంట్ ...ఫిల్టర్ కాఫీ రుచికి ఇంచుమించు సరిసాటి...' అన్నాడు. 

ట్రిపుల్ x సబ్బు చేతికిచ్చి చొక్కా ఉత్తుక్కోమంది అల. 'ట్రిపుల్ x సబ్బు...సంస్కారవంతమయిన సబ్బు...' 

అంటూ నవ్వుతూ ఉతికేసాడు కౌషి. తర్వాత లైఫ్ బాయ్ సబ్బు ఇచ్చింది అల. 'అలా, కావాలంటే, దీని ప్రకటన 

పాడతానే! ఈ సబ్బుతో మాత్రం జీవితంలో రుద్దుకోలేదే...' అని బతిమాలుకున్నాడు కౌషి. సరే, పాడి మెప్పించు, 

ఇంకో సబ్బిస్తా, కాని దాని ప్రకటన కూడా చెప్పాలి...అంది అల. 'ఆరోగ్యానికి రక్షా ఇస్తుంది లైఫ్ బాయ్...లైఫ్ 

బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది..' అని ఉత్సాహంగా ఆరున్నొక్క రాగంలో పాడాడు. వెంటనే 

ప్రసంనమాయి, హమాం సబ్బు అందించింది అల. బాబోయ్, ఇంకో సబ్బు అడిగితే ఎలాంటిది స్తుందో...అనుకుని, 

'నిజాయితీ అంటే హమాం సబ్బు...' అంటూ, బుద్ధిగా స్నానానికి వెళ్ళాడు కౌషి. 'రేయ్మాండ్' దుస్తులు 

వేసుకుంటూ, 'రేమాండ్ ది కంప్లేతే మాన్...' అన్నాడు కౌషి. నవరత్న నూనె రాసుకుంటూ, 'అతి చిన్న 

యే.సి...చల్ల చల్లని కూల్ కూల్...' అన్నాడు. పూజ చేసుకుంటూ ఉండగా, 'అంబికా దర్బార్ బత్తి'ఇస్తే, కళ్ళ

నీళ్ళు పెట్టుకుని, 'అమ్మని మర్చిపోలేము... అంబికా ను మర్చిపోలేము..., నువ్వు రాలేవు కదా అమ్మ...' 

అన్నాడు దీనంగా. 

ఇంతలో ఫోన్ మోగింది... కౌషి బాస్ అర్జెంటు గా ఆఫీసు కి రమ్మన్నాడు...'బ్రతుకు జీవుడా..' అనుకుంటూ, ఒక 

ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. మళ్లీ వస్తానే, సాయంత్రం ఇక నా వంతు... అన్నాడు, 'హీరో హాన్డా...దేశ్ కి 

ధడకన్..' అంటూ బిక పై వెళుతూ ... అల పెంకితనానికి తగిన బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నాడు కౌషి. 

మెరుపులా ఒక ఐడియా తట్టింది. సాయంత్రం ఇంటికి , చుట్టూ ఒక పది మంది ఆడపిల్లలని వెంటబెట్టుకు 

వచ్చాడు... కోపం గా చూస్తున్న అలతో, 'ద ఆక్ష్ అఫెక్ట్...' అన్నాడు. ఇంక ఆలసించిన ఆశాభంగం అని 

అర్ధమయిన అల బుద్ధిగా పెళ్ళికి వప్పేసుకుంది. కధ కంచికి... మనం పేస్ బుక్ కి...

హీరో - హీరొయిన్

 హీరో - హీరొయిన్ 





అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ మన తెలుగు హీరోలకు అచ్చంగా పాతికేళ్ళు. కాలం చెల్లిపోయిన హీరోలకయినా అంతే వయసని, రచయతలు తమ స్క్రిప్ట్లో రాసి మనల్నిభ్రమిమ్పజేస్తారు. మరి టికెట్ కొన్నకా నమ్మక చస్తామా? చచ్చినట్టు ...నమ్మాల్సిందే. పాపం హీరొయిన్ లకు మాత్రం ఈ నియమం వర్తించదు. అందుకే వాళ్ళ వయసు ౩౦ దాటిందా, ఇంతకు ముందు నటించిన హీరోల అక్క పాత్రలు, పిన్ని పాత్రలు వేసి, క్రమంగా అమ్మ పాత్ర, అమ్మమ్మ పాత్రకు పదోన్నతి పొందుతారు. అందుకే వాళ్ళకు 16 యేళ్ళని చెప్పి నటన మొదలుపెడతారు. 

అప్పుడు హీరో 'రాముడు మంచి బాలుడు' టైపు. మంచి ప్రవర్తన కలిగి, విలన్లతో పోరాడి, ధర్మాన్ని, న్యాయాన్ని రక్షిస్తాడు. వీటి కోసం అసహజమయిన విన్యాసాలు చెయ్యకుండా, కత్తి యుద్ధం చేసో, నలుగురిని చితగ్గోట్టో, లేదా ఎత్తుకు పైఎత్తు వేసో, గెలిచేవాడు. మరి ఇప్పటి హీరోలు, పీకలు తెగ్గోసి, చేతులు నరికి, కాళ్ళు విరిచి, మోసాలు చేసి, కిడ్నాపులు, బ్లాక్మైల్లు అంతెందుకు రక్తం ఏరులయ్యి పారితే గానీ శాంతిన్చరు. చూసే పిల్లలు హడిలిపోతారు. అప్పుడు అమ్మలు 'అదంతా టొమాటో సాస్ అమ్మా,' అని ఊరుకోబెడతారు. పైగా ఇలాంటి సన్నివేశాలలో కొట్లాటకు
వొచ్చేవాళ్ళంతా తెల్ల బట్టలు వేసుకుంటారు, ఎందుకో అర్ధం కాదు. అసలు హీరో  హీరోనా, లేక విలనా అనేది కూడా అర్ధం కాదు. ఇప్పటి సినిమాల్లో విలన్ల అవసరం లేదు. హీరోనే డ్రగ్స్ అమ్ముతాడు, మాఫియాలు చేస్తాడు, మోసాలు చేస్తాడు, దొమ్మిలు, దొంగతనాలు,హత్యలు చేస్తాడు. పైగా 'నేనెంత పెద్ద ఎదవనో నాకే తెలియదు' అంటాడు. 'మాకు తెలుసు' అనుకుంటారు ప్రేక్షకులు.

మరి హీరోలు విలన్లయితే , హీరోఇన్లు మడికట్టుకు కూర్చుంటారా? అందుకే ఐటెం సాంగ్స్ కూడా వాళ్ళే పాడేసి, వొళ్ళు దాచుకోకుండా వాళ్ళ వొంతు న్యాయం చేస్తున్నారు. అప్పటి సినిమా పేరులు 'గుణవంతుడు, బుద్ధిమంతుడు, మంచి మనసులు, ఆదర్శ కుటుంబం,' మరి ఇప్పుడో, ' పోకిరి, పొగరు, ఇడియట్, కంత్రి,' కొన్ని విచిత్రమయిన పేర్లు ,'మిరపకాయ్, సీమ టపాకాయ్, ఈగ, ఊసరవల్లి, కందేరీగ, డేగ ' అంటూ. విదేశాల్లో షూటింగ్ అని , గ్రాఫిక్స్ అని బోలెడంత డబ్బు తగలేడతారు. హీరోలకు కొట్లలో ఉండే రేటులు, పాపం హీరొయిన్ లకు మాత్రం లక్షల్లో ఉంటాయి. హీరోయిన్ లకు చివరికి కొంత సొమ్ము ఎగ్గొడతారు. అప్పటికి, ఇప్పటికి మారనిది హీరోయిన్ పాత్ర, ఒక్క బట్టల విషయంలో తప్ప. ఒక మూల నిల్చుని, హీరో నరుకుతుంటే, బెదురుగా, కొన్ని సార్లు ఆశ్చర్యంగా, ఉత్సాహపరుస్తూ చూస్తుంటుంది అంతే. ఎక్కడో సరదాగా హీరిఒనే ప్రధాన సినిమాల్లో, కొన్ని విన్యాసాలు చేయిస్తారు అంతే. ఇంకో మారని విషయం, ప్రేక్షకుల అభిరుచి. భారి సెట్టింగులకి, గ్రాఫిక్స్ కి వెచ్చించే సమయం వైవిధ్యానికి,
కధకి, విలువలకి ఇవ్వట్లేదు. అందుకే అటువంటి సినిమాలు ఫ్లోప్ అయిపోతున్నాయి. చిన్న బడ్జెట్, చిన్న హీరోల సినిమాలు, కధ- కధనం నచ్చి హిట్ అయిపోతున్నాయి. మరి భవిష్యత్తులో అయినా హీరోయిన్ తల రాత మారుతుందేమో చూద్దాం.